getapujari.com logo
vinayakudu
narasimhaswamy
థి గ్రేట్ సప్తర్షి రిసేర్చింగ్ టీం | ఎవరితో ఎలా మాట్లాడాలి? | 56 అక్షరాల అక్షరమాల కవిత | గోవు వర్ణన | గరుడ గమన తవ చరణకమలమిహ | శ్రీ కృష్ణుని మేలుకొలుపు | మన పల్లె జీవనం - మన పల్లె సోయగం | శివుడు యొక్క 19 అవతారాలు మీకు తెలుసా? | ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలు | నక్షత్ర మంత్రాలు | శ్రీశైల రగడ (శ్రీశైల మానసిక యాత్ర) | దర్భ యొక్క ప్రాముఖ్యం | మీరు ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారు? | ఏక వింశతి పత్రాలు | శ్రీ గురు రామాయణ సుధ
ప్రదోషకాలం - వివరణ << బాక్
రచయత: సేకరణ : జంపని శ్రీనివాస మూర్తి గారు

ప్రదోషమంటే అది ఒక కాల విశేషము . ప్రదోషమంటే పాప నిర్మూలన అని అర్థము .  ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయములో చంద్రుడి కదలికల వలన ఏర్పడునది ప్రదోషము . అనగా , చంద్రుడి గతి వలన , ఏర్పడే తిథుల సంధులలో సూర్యాస్తమయము అయితే , అప్పుడు ప్రదోషము అంటారు . కాబట్టి ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయమునకు తిథి మారితే , అప్పుడు ప్రదోషము కలిగే అవకాశము ఉంది . అయితే అన్నిరోజులలో కలిగే ప్రదోషాలపైకి , మూడు ప్రదోషాలకే ప్రాముఖ్యత ఉంది . అవి , చతుర్థి , సప్తమి , త్రయోదశి లలో కలిగే ప్రదోషాలు . వీటిలో కూడా త్రయోదశినాడు కలిగే ప్రదోషాన్ని ’ మహా ప్రదోషం ’ అంటారు .  

ఈ ప్రదోష కాల గణనము ఇలా ఉండును .

          ఏ దినమందు సూర్యాస్తమయమైన తర్వాత తొమ్మిది ఘడియల లోపల చతుర్థి తిథి వచ్చునో , ఆ దినము ప్రదోషము కలుగును . అటులే , ఏ దినమైనా  సూర్యాస్తమయము తర్వాత  చతుర్థి రెండు ఘడియలైనా ఉంటే ఆ దినము ప్రదోషము . 

          ఏ దినమందు సూర్యాస్తమయమైన తర్వాత పదహైదు ఘడియల లోపల సప్తమి తిథి వచ్చునో , ఆ దినము ప్రదోషము కలుగును . అటులే , ఏ దినమైనా  సూర్యాస్తమయము తర్వాత  సప్తమి ఒక్క ఘడియైనా ఉంటే ఆ దినము ప్రదోషము . 

          ఏ దినమందు సూర్యోదయము  తర్వాత అరవై  ఘడియల లోపల త్రయోదశి తిథి వచ్చునో , ఆ దినము ప్రదోషము కలుగును . అటులే , ఏ దినమైనా  సూర్యాస్తమయము తర్వాత  త్రయోదశి అర్ధ ఘడియైనా ఉంటే ఆ దినము ప్రదోషము . 

         ఈ త్రయోదశీ ప్రదోషము అవధిని ఇలాగ లెక్క కట్టెదరు . సాయంత్రం నాలుగున్నర గంటలనుండీ ఇంచుమించు అర్ధరాత్రి వరకూ ప్రదోషమే . కొందరు సూర్యాస్తమయమునకు ముందర రెండున్నర ఘడియలూ , తర్వాత రెండున్నర ఘడియలూ అంటారు . ( ఒక ఘడియ = 24 నిమిషాలు ) 

         ఈ ప్రదోష దినము అనధ్యయనము . సర్వ విద్యలకూ గర్హితమైనది . సూర్యాస్తమయ కాలము మనకు తమోగుణ ప్రధానమైనది . ఆ సమయములో ప్రదోషమైనచో , కొన్ని అనుష్ఠానములు చేయ వలెను . మామూలుగా చతుర్థి , సప్తములలో ధ్యానము , గాయత్రీ జపము చేయవచ్చును. ప్రదోష సమయముపై శివుడికొక్కడికే అధికారము గలదు , కాబట్టి శివ పూజ మాత్రమే చేయవలెను అనునది కొందరి మతము . మామూలుగా ప్రతి పక్షములోనూ ప్రదోషము వచ్చును . కానీ కృష్ణ పక్షములో చతుర్దశి రోజు మాస శివరాత్రి వచ్చును . దాని వెనుకటి రోజు  త్రయోదశి లో  మహా ప్రదోష కాల శివపూజ విధించబడినది . శుక్ల పక్షములో కూడా త్రయోదశికి ప్రత్యేకత గలదు . ఆరోజు కూడా శివ పూజనే చేయవలెను . 

          ప్రదోషమంటే పాప నిర్మూలన అని తెలుసుకున్నాం . మనము రోజూ ఎన్నో పాప కర్మలు చేస్తుంటాము . వాటి ఫలము వలన మనకు మనమే కొన్ని ప్రతిబంధకాలను తెచ్చుకుని , మన పురోభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిమితం చేసుకుంటున్నాము . మన పాప కర్మ ఫలమును నిర్జీవం చేయాలంటే , దానికి తగ్గ పుణ్య కర్మలు చేయవలెను . ఈ త్రయోదశీ ప్రదోషము మనకు దేవుడిచ్చిన వరము . పరమ శివుడు తన ప్రమథ గణాలతో కొలువై మన పూజలు అందుకొనుటకు సిద్ధంగా ఉండు సమయమది . మన పాప కర్మల ఫలాన్ని పటాపంచలు చేసి  గరళము వలె మింగి ,  మనకు సాత్త్విక గుణమును కలిగించి మన కష్టములను తగ్గించును .

              ఈ త్రయోదశి శనివారమొస్తే దాన్ని శని త్రయోదశి యనీ , సోమవారమొస్తే దాన్ని సోమప్రదోషమనీ పిలుస్తారు . ఇవి కాక , గురువారము నాడు వచ్చే ప్రదోషము కూడా అత్యంత ప్రాముఖ్యము గలది . అన్ని త్రయోదశులలోనూ శివపూజ తప్పనిసరి అయినా , ఈ మూడు రోజులూ మాత్రము మరింత విశేషమైనవి .

             శని త్రయోదశి నాడు చేసిన శివపూజ వలన జాతకము లోని  శని ప్రభావము కూడా తొలగింపబడును . శని మహాత్ముడు కర్మలకు ప్రతినిధి అని పిలవబడుతాడు . మన కర్మల ఫలితాన్ని నిర్దేశించి మనకు పాఠాలు నేర్పువాడితడు . అట్టి శని ప్రభావమును కూడా ఈ ప్రదోషపూజతో పోగొట్టుకొనవచ్చును . 

            సోమ ప్రదోషము నాడు చేసిన పూజ వలన మనసు శుద్ధమై త్రికరణ శుద్ధి కలుగును . సోమవారము శివుడికి ప్రీతి పాత్రమైనది . ఆరోజు చేసిన శివపూజ సర్వ పాప హరము , సర్వ పుణ్యదము . 

           ఇక గురువారము త్రయోదశీ ప్రదోషము వస్తే , ఆనాడు చేసిన పూజ వలన గురు అనుగ్రహము కలిగి , విద్యాబుద్ధులు , సంపదలు కలుగుతాయి . గురువు వాక్పతి , బుద్ధిని ప్రేరేపించువాడు , మరియు ధన కారకుడు . జాతకములో గురు దోషములకు రుద్రారాధన విరుగుడుగా చెప్పడము మనకు తెలిసినదే . 

          ఈ త్రయోదశీ ప్రదోషమునాడు ఎవరికి వీలైనంతగా  వారు , మహాన్యాస పూర్వక ఏకాదశవార రుద్రాభిషేకమో , ఏకవార రుద్రాభిషేకమో , లఘున్యాస  నమక చమక పఠనమో  , ఉత్త పాలతో అభిషేకమో , మారేడు దళములతో అర్చననో , ఏదో ఒకటి చేసి అనంత ఫలము పొందండి . భక్తితో ఉద్ధరిణెడు నీళ్ళు పోస్తే  చాలు ,  పొంగిపోతాడు , భోళా శంకరుడు . 

                                       స్సర్వేజనా సుఖినోభవంతు -----------------------------------------
( " మహాద్రష్ట " గ్రంధము ఆధారంగా ) 


సూచన : మా ఈ వెబ్ సైట్ ద్వారా ఎన్నొ రకల మంచి విషయలను ఒకేచొట ప్రజలకు అందచేయలన్న సదుద్దేశ్యం తొ మాకు తెలిసిన, ఎందరో మహనుభవుల నుంచి తెలుసుకన్న, వివిధ రకల గ్రంధముల నుంచి సేకరించిన వివరాలను మీకు అందించటం జరిగింది. మాకు తెలిసిన వివరాలను సాధ్యమైనంత జాగ్రత్తగా పర్యవెక్షించి ఉంచుతున్నము, కాని ఇంకా ఎమైన కొత్త విషయలు చెర్చాలి అన్న, లెక ఉన్నవాటిలొ ఎమైన మార్పులు చెయాలి అన్న , మీ వ్యాఖ్యలు మేము గౌరవిస్తాము. మా "సంప్రదించండి" లింక్ ద్వారా వివరాలను తెలియచేయండి.

Ad Banner